ముళ్లపూడి వెంకటరమణ తన బుడుగు భాషలో సృష్టించిన పాత్రను టైటిల్‌గా పెట్టి హాస్యబ్రహ్మ జంధ్యాల సృషించిన అందమైన చిత్రం 'రెండు జెళ్ల సీత'. శ్రీ భ్రమరాంబికా ఫిలిమ్స్ బ్యానర్‌పై కె. కేశవరావు నిర్మించిన ఈ సినిమాకు రమేశ్ నాయుడు సమకూర్చిన సంగీతం బిగ్ ఎస్సెట్. ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచిన ఈ మూవీ సరిగ్గా 40 సంవత్సరాల క్రితం.. 1983 మార్చి 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి కథ, మాటలను జంధ్యాల స్వయంగా రాశారు.
ఒకే అమ్మాయిని ప్రేమించిన నలుగురు కుర్రాళ్ల కథ ఇది. గోపి, కృష్ణ, మోహన్, మూర్తి అనే నలుగురు అబ్బాయిలు క్లాస్‌మెట్స్ మాత్రమే కాకుండా రూంమేట్స్ కూడా. వాళ్లు ఉంటున్న ఇంట్లోనే ఒక పోర్షన్లోకి సీత అనే అమ్మాయి తన తల్లితండ్రులతో అద్దెకు దిగుతుంది. తొలిచూపులోనే నలుగురు కుర్రాళ్లూ ఆమె ప్రేమలో పడిపోయి, ఆమె మనసు గెలుచుకోవాలని తాపత్రయపడుతుంటారు. ఈ విషయంలో నలుగురి మధ్యా పోటీ ఏర్పడుతుంది. దాంతో లాభం లేదనుకొని, నేరుగా ఆమెనే అడుగుతారు, తమలో ఆమె ఎవరిని ప్రేమిస్తున్నదో చెప్పమని. అప్పుడు సీత తను మధు అనే ఇంకో అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పి షాకిస్తుంది. తన గతం చెబుతుంది. మధు తండ్రి గండభేరుండం ఆ పెళ్లి జరగాలంటే రెండు లక్షల కట్నం కావాలంటాడు. బడిపంతులైన సీత తండ్రి సూర్యనారాయణ దానికి ఒప్పుకొని, పెళ్లికి ఏర్పాట్లు చేసుకోగా, ముహూర్తం సమయానికి సీతమీద్ నింద మోపి పెళ్లి ఆపుచేస్తాడు గండభేరుండం. అతనికి బుద్ధిచెప్పి మధుతో సీత పెళ్లి నలుగురు యువకులూ ఎలా జరిపించారనేది మిగతా కథ.
సీతగా మహాలక్ష్మి అనే చక్కని చుక్క నటించిన ఈ చిత్రంలో నలుగురు అబ్బాయిల పాత్రల్ని నరేశ్, ప్రదీఎప్, రాజేశ్, శుభాకర్ పోషించారు. సీత ప్రేమించిమ అబ్బాయి మధు పాత్రని కమలాకర్ అనే అతను చేశాడు. మహాలక్ష్మి ఎవరో కాదు, అలనాటి నటి పుష్పలత కుమార్తె. అదివరకే కన్నడంలో కొన్ని సినిమాల్లో నటించిన మహాలక్ష్మికి ఇదే తొలి తెలుగు చిత్రం. ఆ నిజ జీవిత తల్లీకూతుళ్లు ఈ సినిమాలోనూ అవే పాత్రలు పోషించడం ఈ సినిమాలోని ఇంకో విశేషం. నిజానికి సీత పాత్రను చెయ్యడానికి సెలక్షన్ కోసం వచ్చినవారిలో విజయశాంతి, భానుప్రియ, శోభన వంటి వాళ్లున్నారు. వాళ్లు కాదని మహాలక్ష్మిని ఎంపిక చేశారు జంధ్యాల. హీరోగా ప్రదీప్‌కు ఇదే చివరి చిత్రం. హాస్యనటిగా శ్రీలక్ష్మికి టర్నింగ్ పాయింట్‌గా ఈ సినిమా నిలిచింది. రిటైర్డ్ మేజర్ మంగపతిగా సుత్తి వీరభద్రరావు నవ్వులు పూయించారు. "నేను రెండుసార్లు పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చాను తెలుసా?" అంటూ ఆయన చెప్పే డైలాగ్‌కు జనం పడీపడీ నవ్వారు. గండభేరుండంగా విలనీని అల్లు రామలింగయ్య పండించిన ఈ చిత్రమి శుభలేఖ సుధాకర్, సాక్షి రంగారావు, సుత్తివేలు, దేవి, పొట్టి ప్రసాద్, రాళ్లపల్లి కీలక పాత్రలు చేశారు.
రమేశ్ నాయుడు సంగీతం సమకూర్చిన 'రెండు జెళ్ల సీత తీపి గుండెకోత', 'సరిసరి పదపదనీ', 'మందారంలో ఘుమఘుమలై', 'కొబ్బరి నీళ్లా జలకాలాడీ' జనాలకి తెగ నచ్చేశాయి. వీటిని వేటూరి రాశారు. క్లైమాక్స్‌లో వచ్చే 'పురుషులలో పుణ్యపురుషులు వేరు' పాటను రాసింది ప్రముఖ రచయిత ఇంద్రగంటి శ్రీకాంతశర్మ. ఆయనకు ఇదే తొలి సినిమా పాట. రెండు జెళ్ల సీత సినిమాని జనం బాగా ఆదరించారు.